ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

  • జిలెటిన్ స్టిక్స్ లభ్యం కావడంతో ఆరుగురు పోలీసులపై వేటు
  • మే 10న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వద్ద వెలుగుచూసిన ఘటన
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పర్యటన మార్గంలో జిలెటిన్ స్టిక్స్ లభించిన ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు వీరిని సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు బెంగళూరు సౌత్ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 10న ప్రధాని మోదీ బెంగళూరులో పర్యటించారు. ఆయన కార్యక్రమం ప్రారంభం కావడానికి గంటన్నర ముందు, నగర శివార్లలోని కగ్గలీపుర-తాతగుని ప్రాంతంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం సమీపంలో రెండు జిలెటిన్ స్టిక్స్ ఉన్న ప్యాకెట్‌ను పోలీసులు గుర్తించారు. డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ రోడ్డు పక్కన గోడ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్‌ను గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన యాంటీ-సబోటేజ్ బృందం వాటిని స్వాధీనం చేసుకుని జాగ్రత్త చర్యలు చేపట్టింది.

ఈ ఘటనపై బెంగళూరు సిటీ, రామనగర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఇవి లభ్యమయ్యాయని, వీటిని అక్కడికి ఎవరు చేర్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ రేంజ్ డీఐజీ గిరీష్ తెలిపారు.

ఈ పరిణామంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. ప్రధాని పర్యటనలో పేలుడు పదార్థాలు దొరకడం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో, ముఖ్యంగా బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు.

Narendra Modi
PM Modi
Bangalore visit
security lapse
gelatin sticks
police suspended
Karnataka BJP
BY Vijayendra
security breach
investigation

More Telugu News